26 Nov 2014

యుద్ధం

Posted by Oblivion in Poetry | 6:58pm


మిత్రమా! ఎక్కడికి పరుగు?
సమరానికా?
అందుకేనా నీ నవ్వులో
ఆ గర్వం?

ఎవడు చెప్పాడు
యుద్ధం ముగిసిన తరువాత
విజయమని?
మిగిలేది రక్తమే
వాడిదో, వీడిదో, నీదో!

తలలు నరకడానికి
ధైర్యం ఎందుకు?
సాన పెట్టి కత్తి విసిరితే
ఎగరవా రెండైనా?

వాడు చంపుతాడో ఏమో అని
వాడు చంపకముందే
వాడ్ని చంపాలని
నీ పరుగు. అంతేగా?

అది ధైర్యమా, పిరికితనమా?
ఎవ్వడికీ సమాధానం ఇవ్వద్దు
అవసరం లేదు.
నువ్వు తెలుసుకో, చాలు!

ఆయుధం పట్టిన
ప్రతివాడు అర్జునుడు కాడు,
కర్మణ్యే వాధికారస్తే
అనగానే కృష్ణుడు కాడు!

గర్వం నీ చేతులు
రక్తం తడిసినప్పుడు కాదు,
కంటినీరు తుడిచినప్పుడు
చూపించు.
వీరుడివని ఒప్పుకుంటా!

వందలకు వందలు
చంపడం కాదు
ఒక్కడిని బ్రతికించు
ఒక్కడిని!

తిరుగుదారి లేని
పయనానికి పంపడం కాదు,
తిరిగిరా! అని
ఒక్కడి భుజం తట్టు

అయినా వెళ్తానంటావా?
వెళ్ళు!
కానీ నా పిలుపు కోసం
ఇక వేచిచూడకు

ఎందుకంటే సమరం తరువాత
మిగిలేది నిశ్శబ్దం!
ఏదీ వినపడనంత దూరం వెళ్ళినా
నిన్ను వెంటాడే నిశ్శబ్దం!

ఆ కఠోర నిశ్శబ్దంలో
వెయ్యి మార్లు నేను
పిలిచినా
నీకు వినిపించదు!

వీడుకోలు!

 

 1